తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సలహాదారుగా డాక్టర్ వాసుదేవ రెడ్డి ఆర్ నలిపిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను ఎన్నారై వైద్య వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరచడంతోపాటు చిన్నారులకు వచ్చే వ్యాధులను అరికట్టడంలో డాక్టర్ వాసుదేవ రెడ్డి సేవలందిస్తారు. ఈ పదవిలో ఎలాంటి జీతం, ప్రోత్సాహకాలు తీసుకోకుండా పని చేయాలని డాక్టర్ వాసుదేవరెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.
తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తానని, దీని సాధనలో ప్రవాస భారతీయ వైద్యులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తానని ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల కాన్సెప్ట్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం బుచ్చిరెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన వాసుదేవరెడ్డి.. 1994లో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చదివారు. ఫ్లోరిడా, మెల్బోర్న్లో ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్ట్‌గా 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. మెల్బోర్న్ రీజినల్ మెడికల్ సెంటర్, హెల్త్ ఫస్ట్ పామ్ బే హాస్పిటల్‌తో సహా పలు దవాఖానాల్లో వైద్య సేవలందించారు.