అమరావతి : దేశంలో అపరమైన సహజ వనరులున్నాయని, వాటిని సరైన విధంగా వినియోగించుకోవాలని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (Vice President Dhankhad ) పిలుపునిచ్చారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లాలో స్వర్ణభారత్ ట్రస్టు (Swarna Bharat Trust ) 23వ వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన వద్ద ఉన్న డబ్బు ఆధారంగా పెట్రోలు కొనుగోలు చేయరాదని, మన అవసరాన్ని బట్టి కొనుగోలు చేయాలని సూచించారు. డబ్బే ప్రధానంగా వీటిని ఇష్టం వచ్చినట్లు మనం వినియోగిస్తే భవిష్యత్ తరాలను మనం కష్టాల్లో పడేసినట్లు అవుతుందన్నారు. సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం దేశ ఆర్థిక శక్తిని (Economic condition ) బలహీన పరచడం సరికాదని పేర్కొన్నారు.
నౌకాశ్రయాల నుంచి ముడి ఇనుము విదేశాలకు ఎగుమతి అవుతుందని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని , దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని అన్నారు. కొంత మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారన్నారు.దీన్ని దేశం భరించే పరిస్థితుల్లో లేదని అన్నారు.
స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు వెంకయ్య నాయుడు కన్న కల సాకారమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) దంపతులు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.