తిరుపతి : విద్యార్థులు తమకిష్టమైన ఏ రంగంలో అయినా లక్ష్యాన్ని నిర్దేశించుకుని విజయం సాధించేదాకా విరామం ఇవ్వరాదని అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి కుమారి రజని విద్యార్థినిలకు పిలుపునిచ్చారు. టీటీడీ విద్యాసంస్థల క్రీడా సలహాదారుగా నియమితులైన కుమారి రజని టీటీడీ పరిపాలన భవనంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మంను మర్యాదపూర్వకంగా కలిశారు. జెఈవో సలహా మేరకు రజని శ్రీ పద్మావతి మహిళా డిగ్రి ,పిజి కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు .
ఆమె మాట్లాడుతూ నిరంతర శ్రమతో అనేక పరాజయాల నడుమ అంతర్జాతీయ క్రీడాకారిణిగా విజయం సాధించానని చెప్పారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగం ఏదైనా అందులో వెంటనే ఫలితాలు రాకపోవచ్చుననే విషయం గుర్తించాలన్నారు. జీవితంలో సమస్యలు ఎన్ని వచ్చినా వెనుకంజవేయకుండా లక్ష్యసాధన దిశగా దూసుకుపోవాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు మానసికంగా అత్యంత ధైర్యంగా ఉండి సమస్యలను ఎదిరించాలని సూచించారు.
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తమ లక్ష్యసాధన కోసం చివరి నిమిషం దాకా కష్టపడాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహదేవమ్మ ఆధ్వర్యంలో అధ్యాపకులు రజనిని ఘనంగా సన్మానించారు.