అమరావతి: కోనసీమ రైతుల క్రాప్ హాలీడే నిర్ణయంతో ప్రభుత్వం దిగొచ్చింది. క్రాప్ హాలీడే ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వ అధికారులు రైతులను కోరుతున్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఏకంగా కలెక్టర్ రంగంలోకి దిగడంతో క్రాప్ హాలీడే చర్చనీయాంశంగా మారింది.
తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోనసీమ రైతుల పరిరక్షణ సమితి క్రాప్ హాలీడే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జిల్లా పరిధిలోని 12 మండలాల్లో క్రాప్ హాలీడే పాటించేందుకు రైతులు ముందుకొచ్చారు. కోనసీమలో దాదాపు 11 ఏండ్ల క్రితం ఇదేమాదిరిగా క్రాప్ హాలీడే ప్రకటించడం సంచలనంగా మారింది.
ఈ సారి రైతులకు ఆ అవకాశం ఇవ్వకుండా చూడాలని జగన్ ప్రభుత్వం అధికారులకు కాస్తా కఠినంగా ఆదేశించింది. దాంతో కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు రంగంలోకి దిగారు. స్థానిక ఆర్డీఓతో కలిసి మండలాల్లో పర్యటిస్తూ క్రాప్ హాలీడే నిర్ణయాన్ని విరమించుకోవాలని రైతులను కోరుతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో సేకరించిన ధాన్యానికి గాను 5,500 మంది రైతుల ఖాతాల్లో రూ.120 కోట్లు డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. మరో వారం రోజుల్లో కాల్వల పూడికతీత కార్యక్రమాలను చేపడతామని, పంటలకు నీరు విడుదల చేస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇస్తున్నారు. దాంతో సంతృప్తి చెందుతున్న రైతులు తమ క్రాప్ హాలీడే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి ముందుకు వస్తున్నట్లుగా సమాచారం.