తిరుమల : తిరుమలలో వయోవృద్ధుల దర్శనానికి (Elderly people’s darshan) సంబంధించి సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న తప్పుదోవ పట్టించే వార్తలు అవాస్తవమని టీటీడీ (TTD) పేర్కొంది. ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటా(Online)ను విడుదల చేస్తోందని వెల్లడించింది.
తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్, పీహెచ్సీ లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి వయోవృద్ధులు, దివ్యాంగులకు అనుమతిఇస్తున్నామని స్పష్టం చేశారు. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని అధికారులు కోరారు.
శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేసిన అదనపు ఈవో
తిరుమలలోని శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరుగనున్న నేపథ్యంలో నాలుగు మాడ వీధుల్లో ఉన్న వివిధ ప్రవేశ, బయటకు వెళ్లే దారి, హారతి పాయింట్ల గురించి తెలుసుకోవడానికి అన్ని గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
వాహన మండపం నుంచి ప్రారంభమై నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, తిరుమల నంబి ఆలయం వద్ద కదిలే వంతెన, ఇతర సంబంధిత సమాచారాన్ని అధికారులు అదనపు ఈవోకు వివరించారు. ఆయన వెంట ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజివో నంద కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.