YS Sharmila | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబును కాపాడటానికి, డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత ఆరోపణలా? మరీ ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ అని ప్రశ్నించారు. మీ జెండా, అజెండా అంతా చంద్రబాబు కోసమే అని నిలదీశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని అధికారంలో ఉన్న చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి, సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన వైఎస్ జగన్ మీద విమర్శలు చేయడమేంటని వైఎస్ షర్మిలపై వరుదు కల్యాణి మండిపడ్డారు. అఘాయిత్యాలకు ఆడపిల్లలు బలైపోతుంటే ఎందుకు నోరు కూడా మెదపలేదు.. చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
దివంగత నేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మరింత వన్నెలద్ది, దాన్ని మరింత పటిష్టంగా జగన్ అమలు చేశారని స్పష్టం చేశారు. ఈ పథకం అమలు విషయంలో తండ్రి కంటే మరో నాలుగు అడుగులు ముందుకేశారని గణాంకాలే చెబుతున్నాయని వివరించారు. కోర్సులకు ఎంత ఖర్చయితే అంతా సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ప్రతి మూడు నెలలకోసారి చెల్లింపులు చేశారని పేర్కొన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1778 కోట్లను చెల్లించడంతో పాటు, విద్యా దీవెన, వసతి దీవెనల కింద మొత్తంగా రూ.18,663 కోట్లు చెల్లించి విద్యార్థులకు, పేద కుటుంబాలకు అండగా నిలిచారని అన్నారు. ఇవన్నీ వాస్తవాలు అయితే, మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని షర్మిలపై మండిపడ్డారు. కేవలం పొలిటికల్ డైవర్షన్కోసమే కదా ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2024 సంవత్సరానికి సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫీజులను ఏప్రిల్, మే నెలలో ఇవ్వాల్సి ఉందని వరుదు కల్యాణి తెలిపారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి చంద్రబాబు ఫిర్యాదు చేయడంతో వాటి విడుదల నిలిచిపోయిందని అన్నారు. ఆతర్వాత ఏప్రిల్ – మే- జూన్ త్రైమాసికం, జులై-ఆగస్టు-సెప్టెంబరు త్రైమాసికంగా, మొత్తంగా మూడు త్రైమాసికాలకు సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపుగా రూ.2100 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. కాని ఇప్పటివరకూ చెల్లించని చంద్రబాబును నిలదీయకుండా జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించడం వెనుక మీ ఉద్దేశాలు ఏంటని షర్మిలను నిలదీశారు. ఇది టీడీపీతో మీకున్న మ్యాచ్ ఫిక్సింగ్ కాదంటారా అని ప్రశ్నించారు.
వసతి దీవెన కింద ఇచ్చే పిల్లల హాస్టల్ ఫీజులకూ ఎన్నికల కోడ్ అడ్డం రాడంతో మార్చి-ఏప్రిల్‌లో చెల్లించాల్సిన రూ.1,100 కోట్లు నిలిచిపోయాయని వరుదు కల్యాణి తెలిపారు. మరో విడత కూడా దగ్గరపడుతోందన్నారు. పిల్లల చదువులు, హాస్టల్ ఫీజుల కింద చంద్రబాబు ఫీజురీయింబర్స్‌మెంట్, హాస్టల్ ఫీజుల కింద ఈ రెండింటికి కలిపి ఇప్పటివరకూ పడ్డ బకాయిలు రూ.3200 కోట్ల పై మాటే అని అన్నారు. పథకాలకు పేర్లు అయితే మార్చారు కాని అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా.. ఒక్కపైసా ఇవ్వలేదని తెలిపారు. మరి మీరు ప్రశ్నించాల్సింది ఎవర్ని అని షర్మిలను ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వాల్సిన చంద్రబాబునా? లేక పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన జగన్నా? అని నిలదీశారు.
కేవలం చంద్రబాబును కాపాడాలన్న తపనకొద్దీ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని షర్మిలను వరుదు కల్యాణి ప్రశ్నించారు. ఒక రాజకీయపార్టీగా మీకు అజెండా ఉందా? లేక బాబుగారి అడుగులకు మడుగులొత్తడం, ఆయన కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే మీ అజెండానా? అని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డిగారి మీద మీకు అంత అసూయ ఎందుకు ? అని అడిగారు.