Nara Lokesh | ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరిందని.. ఈ మైలురాయి తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఫైనల్ జాబితాలో లేని అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని సూచించారు. హామీ ఇచ్చినట్లుగా ప్రతి ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. దృఢ సంకల్పంతో ఉండండి.. డీఎస్సీకి సన్నద్ధమవ్వండి.. మీ అవకాశం కోసం ఎదురుచూడండి అని సూచించారు.
మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరిందని నారా లోకేశ్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమరావతిలోని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్ట మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేశారని నారా లోకేశ్ గుర్తుచేశారు. కేవలం 150 రోజుల్లోనే పాఠశాల విద్యా శాఖ మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తుచేశారు. ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.
ఈ మైలురాయి తన బాధ్యతలను మరింత పెంచిందని నారా లోకేశ్ అన్నారు. యంగ్ మైండ్స్‌ను ప్రోత్సహించడం, మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం అలాగే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ప్రతి తరగతి గదికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని తెలిపారు.