తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్లైన్లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను (Middlemen) సంప్రదించవద్దని టీటీడీ (TTD) మరోసారి సూచించింది. ఇటీవల వెరిఫికేషన్లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి (Srivani) లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. అటువంటి వాటినీ బ్లాక్ చేసి వారికి మెసేజ్ ఫార్వార్డ్ చేశామని వివరించారు.
కొంతమంది భక్తులు 225 శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నారని, అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడు టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తోందని పేర్కొన్నారు. దర్శనం, సేవలు, వసతి బుకింగ్లలో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టీటీడీ విజిలెన్స్(TTD Vigilence) గుర్తిస్తోందని వెల్లడించారు.
యాత్రికులు మధ్యవర్తుల వద్దకు వెళ్లవద్దని, ఆన్లైన్(Online) లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు. అవకతవకలకు పాల్పడే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
6 గంటల్లో సర్వదర్శనం..
తిరుమతి : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల(Tirumala) కు తరలివస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,095 మంది భక్తులు దర్శించుకోగా 23,127 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 3.72 కోట్లు వచ్చిందని తెలిపారు.