తిరుమల : శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కొందరు ఇతర ప్రాంతాలలో తీసిన వీడియోలు, ఫొటోలను తిరుమలలో తీసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి భయాందోళనకు గురి చేస్తున్నారని, భక్తులు వీటిని నమ్మవద్దని కోరారు.
మొదటి ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలను తొలగించి శుక్రవారం ఉదయం రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలిపారు. తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుమలకు ఈ మార్గంలోనే వాహనాలను అనుమతిస్తున్నట్లు వివరించారు. రెండో ఘాట్ రోడ్డులో కొండచరియల తొలగింపు పనులు పూర్తయ్యాయని, రోడ్డును శుభ్రం చేసిన అనంతరం భక్తులను అనుమతిస్తు న్నామని చెప్పారు. భక్తులు వర్షం తగ్గినంత వరకు గదుల్లోనే ఉండాలని, అందరికీ అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
దర్శన టికెట్లు బుక్ చేసుకుని వర్షం కారణంగా తిరుమలకు రాలేని భక్తులకు మరోసారి శ్రీవారి దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు. అంతకు ముందు ఆయన తిరుమల జీఎన్సీ, నారాయణ గిరి గెస్ట్ హౌస్, మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి ప్రాంతాలను, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.