Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో రేగిన చిచ్చు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నది. దివ్వెల మాధురి అనే మహిళతో సంబంధం పెట్టుకుని తమను వదిలేశారని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఆందోళన చేయడం ఇప్పుడు పెద్ద దుమారం రేగింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ వల్ల తమ పరువు పోతుందని.. ఆయన టెక్కలి వదిలి వెళ్లిపోవాలని ఆయన భార్య వాణి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై దివ్వెల మాధురి కూడా స్పందించారు.
దువ్వాడ శ్రీనివాస్‌ను తాను ట్రాప్ చేయలేదని దివ్వెల మాధురి స్పష్టం చేశారు. తననే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి రాజకీయంగా తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ పొందడం కోసం తనను పావుగా వాడుకుందని తెలిపారు. వాణినే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని.. ఇప్పుడు తానెవరో తెలియదని అంటుందని విమర్శించారు. దువ్వాడ శ్రీనివాస్‌కు, వాణికి మధ్య ఏవైనా విబేధాలు ఉంటే వారే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. వాణి మాటలు పట్టుకుని అనవసరంగా తనను ఇందులోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.
స్వార్థంతో వాణి తనపై నిందలు వేశారని.. తన వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీసిందని మాధురి ఆరోపించారు. ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఓ ఫ్రెండ్‌లా, కేర్‌టేకర్‌లా తనతో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తామిద్దరం కలిసే ఉంటున్నామని స్పష్టం చేశారు. అయితే తమది సహజీవనం కాదని.. అడల్ట్రీ రిలేషన్ అని పేర్కొన్నారు.
నాన్న.. నాన్న అంటూ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు వస్తున్నారని.. ఈ రెండేళ్లు ఏమైపోయారని వారిని మాధురి ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ కొన్ని రోజులు రోడ్డుపైనే ఉండియారని.. అప్పుడు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. శ్రీనివాస్‌ను వాణి ఇంట్లోకి రానివ్వకపోతే తన ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. శ్రీనివాస్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని.. అతని వద్ద ఆస్తులేమీ లేవని ఆమె స్పష్టం చేశారు. ఉన్నవన్నీ కుటుంబానికే దారాధత్తం చేశారని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఆర్థికంగా మంచి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. శ్రీనివాస్‌ను ట్రాప్ చేయాల్సిన అవసరం తనకేంటి? అని ప్రశ్నించారు. శ్రీనివాస్‌ను డబ్బు కోసం ట్రాప్ చేయాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. ఎన్నికల కోసం శ్రీనుకు తన సొంత డబ్బు రెండు కోట్లు ఖర్చు చేశానని బయటపెట్టారు.
తనపై రెండేళ్లుగా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారని దివ్వెల మాధురి మండిపడ్డారు. కుటుంబంలో ఏవైనా విబేధాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని.. లేదంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని సూచించారు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని.. ఇలాంటి ఆరోపణలు వస్తే వాళ్ల భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణల కారణంగానే తన కుటుంబానికి, భర్తకు దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన మచ్చ ఎప్పటికీ పోదని.. అందుకే దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉండాలని నిర్ణయించుకున్నా అని చెప్పారు.