అమరావతి : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ముమ్మరయత్నాలు ప్రారంభించారు. దీంట్లో భాగంగా బీఆర్ఎస్కు అన్ని రాష్ట్రాల ప్రజల నుంచి స్పందన రావాలని కోరుకుంటూ తెలంగాణకు చెందిన నాయకులు ఏపీలో పర్యటనను ప్రారంభించారు. ముందుగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి గుడి ఆవరణలో గాలి గోపురం వద్ద బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రాలతో ఉన్న బీఆర్ఎస్ బ్యానర్‌ను ప్రదర్శించి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోమల్ల రవి ముదిరాజ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి సాధించినట్లుగానే దేశం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని అన్నారు. త్వరలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో పర్యటించనున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, టీడీపీ, వైసీపీలకు బీఆర్ఎస్ ప్రత్యామ్నయమని అన్నారు. బీఆర్ఎస్ను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు సీ. సంజయ్, అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.