Chandrababu-Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆదివారం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం ముగిసింది. ఇరువురి మధ్య గంటన్నర సేపుకు పైగా చర్చలు జరిగాయి. వారిద్దరి మధ్య చర్చలు సంతృప్తికరంగా సాగాయని జనసేన అగ్రనేత నాదేండ్ల మనోహర్ చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరిగాయన్నారు.
ఇంతకుముందు పలుమార్లు చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళితే చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ ఇంటికి తొలిసారి చంద్రబాబు చర్చకు రావడం ఆసక్తి కర పరిణామం. ఏపీలో వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ వెళుతుందా? లేదా? అన్నది మున్ముందు తేలుతుందని చెబుతున్నారు.