అమరావతి: ఏపీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)పై చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రేపు మరోసారి చర్చలు జరిపేందుకు మంత్రుల కమిటీ సీపీఎస్ ఉద్యోగుల జేఏసీ నేతలను ఆహ్వానించింది. సీపీఎస్ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ సర్కార్ మంత్రుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. పాత పెన్షన్‌పై మాట్లాడదామని చెబితేనే చర్చలకు వచ్చామని సీపీఎస్ ఉద్యోగుల జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.
సీపీఎస్‌పై మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల చర్చలు ముగిశాయి. చర్యలు అసంపూర్తిగా ముగియడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పెన్షన్ విధానంపై చర్చించేందుకు రావలని పిలిస్తేనే తాము వచ్చామని, అయితే తీరా వచ్చాక జీపీఎస్‌పై చర్చించేందుకు మంత్రులు సిద్ధమయ్యారని ఉద్యోగులు తెలిపారు. జీపీఎస్ విధానం గురించి మాట్లాడాలని అనుకుంటే ఇకపై అసలే చర్చలకు పిలువొద్దని మంత్రులకు స్పష్టం చేసినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.
సీపీఎస్‌పై చర్చించేందుకు పిలిస్తే చర్చలకు వచ్చామని, అయితే సమావేశంలో జీపీఎస్ ప్రస్తావనకు రావడంతో నిరాశకు గురైనట్లు ఏపీ సీపీఎస్ యూఎస్ అధ్యక్షుడు దాస్ విచారం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను సాధించుకునేందుకు త్వరలో భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇలాఉండగా, రేపు మరోసారి సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలుచేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపిందని ఆయన చెప్పారు. మంత్రి బొత్సతో జరిగే మరుసటి సమావేశానికి హాజరుకావాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉద్యోగులు ఉన్నారు.