అమరావతి : ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ (Constable) నియామక ప్రక్రియకు (Appointment process ) సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలో అపశ్రుతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలో (Krishna District) గురువారం జరిగిన 1600 మీటర్ల పరుగు పందెంలో ( Running race) ఏ కొండూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్(26) అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు లోనై కిందపడిపోయాడు.
దీంతో పోలీసు (Police) సిబ్బంది వెంటనే చికిత్స కోసం యువకుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్ధులు ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు జరుగుతున్నాయి.
దీంట్లో భాగంగా ప్రతి రోజూ ఆయా కేంద్రాల్లో 600 మంది చొప్పున అభ్యర్థులకు ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరి 5న ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 95,209 మంది అభ్యర్ధులు ఫిజికల్ టెస్టులకు ఎంపికయ్యారు.