అమరావతి : తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం (Low pressure) ఏర్పడింది. దీంతో మరో 36 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలున్నాయని వాతావరణశాఖ తెలియజేసింది. ఈనెల 27 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని , అనంతరం రెండురోజుల్లో అల్పపీడనం బలపడే సూచనలున్నాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రజలు రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు, ప్రజలకు హెచ్చరించారు. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు. శుక్రవారం పార్వతీపురం, అల్లూరి , ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపారు. మిగతా జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఎల్లుండి అల్లూరి, తూర్పుగోదావరి, కోనసీమ, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాలో వర్షాలు పడుతాయని తెలిపారు.