తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు ఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి నేరుగా క్యూలైన్లో వెళ్లి దర్శించుకుంటున్నారని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని వివరించారు.
నిన్న ఏడుకొండల స్వామివారిని 67,616 మంది భక్తులు దర్శించుకోగా 22,759 మంది భక్తులు తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారి హుండీ(Hundi Income) కి రూ. 3.89 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
అంకితభావంతో సేవలు అందించాలి..
టీటీడీ ఉద్యోగులు భక్తులకు అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆలయ, వసతి విభాగాల ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ప్రపంచం నలుమూలల నుండి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తుంటారని తెలిపారు. విభిన్న ప్రాంతాలు, భాషలు, సంస్కృతికి చెందిన వ్యక్తులతో సేవా భావంతో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు నెలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నద్ధం కావాలని ఉద్యోగులను కోరారు.