తిరుమల : తిరుమలలో ( Tirumala ) శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్( TTD Chairman ) బీఆర్ నాయుడు శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్షయ కిచెన్ ను తనిఖీ చేసి భక్తుల కోసం తయారు చేస్తున్న అన్న ప్రసాదాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎలాంటి జాప్యం లేకుండా భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు నిరంతరాయంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ అధిక రద్దీ కారణంగా దర్శనం కోసం వేచి ఉండే సమయం పెరుగుతుండటంతో ఎలాంటి ఆందోళన చెందకుండా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్, ఏఈవో శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పెరిగిన భక్తుల రద్దీ
వారంతపు సెలవు కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి. 31 కంపార్టుమెంట్లు నిండి కృష్ణ తేజ గెస్ట్‌హౌజ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,821 మంది భక్తులు దర్శించుకోగా 33,568 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.36 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.