అమరావతి : ఏపీలోని నరసరావుపేటలో హత్యకు గురైన ప్రైవేట్ ఉద్యోగి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక జ్యుయలరీ దుకాణంలో ఉద్యోగిగా పనిచేస్తున్న రామాంజనేయులను కొందరు అపహరించి హత్యచేసి ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద జాతీయ రహదారి పక్కనున్న వంతెన కింద పడేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రామాంజనేయులును కిడ్నాప్ చేసిన దుకాణం నుంచి తీసుకెళ్లిన మార్గాలను సీసీ ఫుటేజి ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. భార్య చెప్పిన అనుమానితుల పేర్ల ఆధారంగా జంగం బాజీ, జంగం రామయ్య అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు డీఎస్పీ విజయ్‌భాస్కర్ ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పాత కక్షలతోనే అతన్ని హత్య చేశారని వివరించారు. రామాంజనేయులు హత్యలో రాజకీయ కోణం లేదని పేర్కొన్నారు. మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.