అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల కోరిక మేరకు ఇష్టారీతిన జిల్లాల విభజన జరిగిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆరోపించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, పాలన ప్రారంభంపై ఆయన మాట్లాడారు. లోపభూయిష్టంగా జిల్లాల విభజన జరిగిందని, ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేపట్టారని విమర్శించారు. జిల్లా డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని అన్నారు. ముంపు మండలాల గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.
జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాలని, కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా ఇబ్బందులు తప్పడం లేదని పవన్‌కల్యాణ్ అన్నారు. రంపచోడవరం కేంద్రంగా ఉండాలన్న గిరిజనుల అభిప్రాయం పట్టించుకోలేదని, రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.
మదనపల్లె, హిందూపురం, మార్కాపురం కేంద్రాలుగా డిమాండ్లు ఉన్నాయని వివరించారు. లోపాలు, అసౌకర్య విషయాలపై ప్రజల నిరసనలకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా సౌకర్యమే ప్రధానంగా పునర్వ్యవస్థీకరణ బాధ్యత జనసేనదని స్పష్టం చేశారు.