అమరావతి : శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారు ఆదివారం కాళీయమర్దనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారిని వైభవంగా ఊరేగించారు. వాహనసేవ అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.
ఇవాళ సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తున్నామని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో రమణప్రసాద్, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం చక్రస్నానం, రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు. 19న సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు.