తిరుపతి : తిరుపతి కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవం (Annual Brahmotsavam) ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని (Tirumanjanam) నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
ఏప్రిల్ 9న మహతిలో ఉగాది సంబరాలు
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది(Ugadi) వేడుకలు ఈనెల 9l తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థవారిచే వేదపారాయణం నిర్వహిస్తారని చెప్పారు.
ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం, అనంతరం అష్టావధానం, టీటీడీ ఉద్యోగుల పిల్లలతో ”తెలుగు వైతాళికులు” వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం, ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుందని వెల్లడించారు.