AI Video Calls | జనాలు అప్డేట్ అవుతున్నా కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా తెలివి మీరుతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీని వాడుకుంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉండటంతో జడ్పీటీసీ టికెట్ ఇస్తామని చెప్పి కొత్త మోసానికి తెరతీశారు. ఇందుకోసం ఏకంగా ఏఐ టెక్నాలజీని వాడుకుని మాజీ మంత్రి దేవినేని ఉమ పేరుతో వీడియో కాల్ చేశారు. అంతటితో ఆగకుండా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చంద్రబాబు వాయిస్‌తో కూడా మాట్లాడారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సైబర్ మోసం.. అప్రమత్తంగా లేకపోతే టెక్నాలజీతో మనల్ని ఎలా మోసం చేస్తున్నారో తెలియజేస్తోంది.
అసలేం జరిగిందంటే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున జడ్పీటీసీ టికెట్ ఇప్పించాలని ఇటీవల మాజీ మంత్రి దేవినేని ఉమను ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన మోరకొండ ఏడుకొండలు కోరారు. ఈ విషయం ఎలా తెలిసిందేమో.. దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకున్నారు. ఈ నెల 8వ తేదీన దేవినేని ఉమకు వాట్సాప్‌లో ఒక వీడియో కాల్ చేశారు. దేవినేని ఉమలాగే ఉన్న వ్యక్తి ఏడుకొండలుతో మాట్లాడాడు. ఆ తర్వాత కాసేపటికి మామూలు కాల్ చేసి చంద్రబాబు మాట్లాడతారని చెప్పాడు. అనంతరం చంద్రబాబు వాయిస్‌తో ఒకతను కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. జడ్పీటీసీ టికెట్ నీకే ఇస్తా.. డైరీలో పేరు రాసుకున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. అనంతరం నార్మల్ కాల్ చేసి.. తమ నెంబర్‌కు రూ.లక్ష యూపీఐ చేయాలని అడిగాడు. ఇందుకు ఏడుకొండలు తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని.. తర్వాత రోజు డబ్బులు పంపిస్తానని చెప్పాడు.
ఆ తర్వాత రోజు విజయవాడలో ఓ శుభకార్యానికి ఏడుకొండు వెళ్లారు. ఈ క్రమంలో తిరిగి వస్తుండగా దేవినేని ఉమ ఇంటికి వెళ్లి.. జరిగిన విషయాన్ని ఆయనకు చెప్పాడు. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా దేవినేని ఉమ పేరుతో ఇలా ఫేక్ కాల్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. 20 రోజుల క్రితం కూడా భరత్ అనే యువకుడికి జడ్పీటీసీ టికెట్ ఇప్పిస్తామని మోసం చేశారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన టీడీపీ అభిమానిని కూడా ఇలాగే ఏఐ సాయంతో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. గత నెల 30వ తేదీన దేవినేని ఉమ పీఏను అని చెప్పుకుంటూ సదరు యువకుడికి వీడియో కాల్ చేశారు. అనంతరం దేవినేని ఉమ మాట్లాడతారని చెప్పి.. ఏఐ వీడియో కాల్ మాట్లాడారు. పేద పిల్లల చదువుకు సాయం చేయాలని దేవినేని ఉమలా కోరడంతో.. బాధితుడు 35వేలు ట్రాన్స్ఫర్ చేశారు. మళ్లీ వారం తర్వాత బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బీఫామ్ ఇస్తామని చెప్పారు. ఇదే విషయంపై చంద్రబాబు మాట్లాడతారని.. మరోసారి ఏఐ వీడియోకాల్ చేశారు. అమరావతి వస్తే బీఫామ్ ఇస్తామని నమ్మించారు. విజయవాడలోని ఒక హోటల్లో దిగమని చెప్పారు. ఇది నమ్మిన బాధితుడు 18 మంది అనుచరులను తీసుకుని ఈ నెల 8న విజయవాడకు వచ్చాడు. ఫోన్ కాల్లో చెప్పిన హోటల్‌కు వెళ్లగా.. అక్కడ ఎవరూ లేరు.. కానీ హోటల్ సిబ్బంది వచ్చి బిల్లు కట్టాలని డిమాండ్ చేశారు. మేమెందుకు కడతామని బాధితుడు ప్రశ్నించడంతో.. వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వచ్చి దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది.
ఇలా ఈ రెండు ఘటనల్లోనూ సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని విపరీతంగా వాడుకుని ఆశవాహులను నమ్మించి బురిడీ కొట్టించారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకూడదని చెబుతున్నారు. అన్నోన్ నంబర్ల నుంచి ఫోన్ చేసి డబ్బులు అడిగితే ట్రాన్స్ఫర్ చేయవద్దని సలహా ఇస్తున్నారు.