తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) సందర్భంగా భద్రత ఏర్పాట్లను సోమవారం టీటీడీ (TTD) సీవీఎస్వో శ్రీధర్ పరిశీలించారు. అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. భద్రత (Security) పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
వాహనమండపం, భక్తులు గ్యాలరీలలోనికి వచ్చేందుకు మాడ వీధులలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, గ్యాలరీలలోని ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాల పార్కింగ్, తదితర అంశాలను పరిశీలించి సూచనలు చేశారు. ఆయన వెంట ఈఈలు సుబ్రహ్మణ్యం, సుధాకర్, డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, ఆర్యోగ శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం
తిరుమల ( Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టీబీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం (Sarvadarshan ) కలుగుతుందని అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 84,060 మంది భక్తులు దర్శించుకోగా 34,985 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీ (Hundi) కి రూ. 4.01 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.