Nellore | నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం డేగలపూడి వద్ద కల్వర్టు కూలిపోయింది. మొంథా తుపాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు ఈ కల్వర్టు కూలిపోయింది. అది కాస్త ఇవాళ కూలిపోయింది. దీంతో నెల్లూరు – రాజంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
నెల్లూరు, రాజంపేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యంతోనే కల్వర్టు కూలిపోయిందని ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టి ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మొంథా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో 450 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని జిల్లా అధికారులు గతంలోనే అంచనావేశారు. పొదలకూరు, రాపూర్ మధ్య ఉన్న ఎస్సీ కాలనీ సమీపంలోని కల్వర్టు లోపలకు కుంగిపోయిందని కూడా గుర్తించారు. దీనికి తాత్కాలికంగా పైపుల ద్వారా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. కానీ అందుకు అనుగుణంగా చర్యలు మాత్రం తీసుకోలేదు. దీంతో మరింత దెబ్బతిన్న కల్వర్టు తాజాగా కూలిపోయింది. ఈ కల్వర్టుతో పాటు కావలి, కొండాపురం, బ్రాహ్మణక్రాక, అనంతవరం, గండవరం, రాళ్లపాడు, కలిగిరి, ఓబులాపాలెం ప్రాంతాల పరిధిలో రహదారులు దెబ్బతిని ప్రయాణం కష్టంగా మారింది. చాలా కల్వర్టులు దెబ్బతినడంతో వాటి మరమ్మతులకు రూ.19 కోట్ల వరకు అవసరమవుతాయని కూడా తేల్చారు. కానీ మరమ్మతులు మాత్రం చేపట్టలేదు.