తిరుమల : తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ ( TTD ) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 84,113వేల మంది భక్తులు దర్శించుకోగా 33,868 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.12 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
కోదండరాముని ఆలయంలో ఘనంగా పుష్పయాగం
తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగాసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.
తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలిరేకులు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు 3 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు. పుష్పయాగం అనంతరం రాత్రి 7 నుంచి శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.