Suicides : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాఖీపండుగ నాడు రాత్రి ఓ ఆటో డ్రైవర్ కుటుంబంలో అతనితోపాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని బట్టి చూస్తే ఆటో డ్రైవర్ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి, ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. మల్లా వినోద్‌కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి చింతలాగ్రహారం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏమైందో ఏమో.. కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. వినోద్‌కుమార్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతడి భార్య, ఇద్దరు కుమార్తెలు విగతజీవులుగా పడి ఉన్నారు.
దీన్నిబట్టి వినోద్‌కుమార్ ముందుగా తన భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి, ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కాగా, రాఖీ పండుగ సందర్భంగా సంతోషంగా గడిపిన కొన్ని గంటల్లోనే ఈ దారుణ ఘటన జరగడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుటుంబం ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.