Pawan Kalyan | హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ అనర్హుడని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా, ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలు సాంకేతికంగా విడిపోయినప్పటికీ.. ప్రజలు కలిసే ఉన్నారని నారాయణ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుమార్తెను ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలిరోజుల్లో తనకు చేగువేరా ఆదర్శమని చెప్పాడని.. ఇప్పుడు సావర్కర్‌ను భుజాన వేసుకుని సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. సనాతన ధర్మం కోసం తిరగాలని అనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని.. కాకపోతే రాజకీయాలను వదిలేసి ఆ పనిచేసుకోవాలని హితవుపలికారు.
దిష్టి తగిలింది వంటి మాటలు మాట్లాడే సనాతనవాదికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని నారాయణ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు తగడని పేర్కొన్నారు. తక్షణమే పవన్ కల్యాణ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.