Narayana | సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నగరం బైరాగపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీతో పాటు దేశ రాజకీయ అంశాలపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సంక్షోభంలో పడిందని.. మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గుతోందని.. మోదీని మార్చాలని బీజేపీ నేతలే అంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. మోదీ తీరుపై ఆర్ఎస్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, 2109లో బీజేపీకి 300కి పైగా సీట్లు వచ్చాయని.. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 400 సీట్లు సాధిస్తామని మోదీ ఢంకా భజాయించినా చివరకు 240కే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్లో సైతం వచ్చే పరిస్థితి ఉందన్నారు.
నియంతలా వ్యవవహరిస్తున్న నరేంద్రమోదీకి చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకోవాలని.. చంద్రబాబు భయంతో కాకుండా ఏపీ హక్కులను రాజ్యాంగం బద్ధంగా అడగాలన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీలో జరిగిన భూ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. యాప్ రుణాల పేరుతో వేధించే వారిని కట్టేయాలన్నారు. దేశంలో నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిలక్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య భారతంలో అతితక్కువ మెజార్టీతో గెలిచిన ప్రధానిగా మోదీ నిలిచారని.. ఏపీ నుంచి చంద్రబాబు, బీహార్ నుంచి నితీశ్ మద్దతు ఇవ్వకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదన్నారు. బంగ్లాదేశ్ లో హసీనా నాల్గోసారి ప్రధాని అయ్యారని, అయితే ఆమె నియంతృత్వ పోకడలతో ప్రజలు తిరుగుబాటు చేయడంతో దేశం విడిచి భారత్లో తలదాచుకుంటుందన్నారు. పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ ఎంతో బలంగా ఉన్నప్పటికీ.. ఇటీవల వైద్య విద్యార్థిని హత్యాచారంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇదే ప్రభావం నరేంద్రమోదీపై కూడా పడుతుందని ఆయన అన్నారు. మోదీని దింపాలని ఆయన సొంత పార్టీ నేతలే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్డీయే ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయిందని, మోదీ మెడపై అసంతృతప్తి కత్తి వేలాడుతోందన్నారు. దేశంలో ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి ఉందన్నారు. ఇక ఇటీవల కాలంలో మహిళలపై మానభంగాలు పెరిగి పోయాయని… ఇందుకు పాలకులే బాధ్యత వహించాలన్నారు.
ముంబయి సినీ నటి కాదంబరి జెత్వానీని వేధించిన పోలీసు అధికారులను, నేతలను విజయవాడలో కట్ డ్రాయర్లతో ఊరిగిస్తే తప్ప వారికి బుద్ధి రాదన్నారు. అలా చేయకపోతే పోలీసు అధికారులు భయపడరన్నారు. ఇక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదన్నారు. ముంబయి సినీనటి సంఘటనను పక్కదారి పట్టించడానికి కొంతమంది గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల ఘటనను తెరమీదపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఇటీవల కాలంలో యాప్ల పేరుతో పేదలకు రుణాలు ఇస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని.. వేధించే వారిని ఇళ్లకు వస్తే కట్టేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు సీపీఐ నేతలు అండగా నిలుస్తారన్నారు. యాప్ రుణాల వారు పేదలను వేధిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమన్నారు. యాప్ రుణాల వేధింపుల బారి నుంచి బయట పడటానికి చట్టాలను ప్రజలు చేతుల్లోకి తీసుకోవాలన్నారు.