అమరావతి : తిరుమల, తిరుపతి దేవస్థానం మాదరిగా శ్రీశైలం ( Srisailam ) ఆలయం అభివృద్ధికి మంత్రులతో కమిటీని వేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ( CM Chandrababu ) వెల్లడించారు. ఈ కమిటీలో మంత్రులు పవన్ కల్యాణ్, ఆనం రాంనారాయణరెడ్డి, దుర్గేశ్, జనార్దన్ రెడ్డి, జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు.
విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్‌ను (Sea Plane ) ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం అదే ప్లేన్‌లో శ్రీశైలం వరకు వచ్చి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మంత్రులతో కమిటీ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల సలహాలు తీసుకుని శ్రీశైలం ప్రాంతం దైవక్షేత్రంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని వివరించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణ పరిస్థితులు ఉంటే పరిశ్రమలు, పర్యాటక రంగం, ఆధ్యాత్నిక కేంద్రాలు అభివృద్ధి చెందుతాయని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు . దీని వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు.
శ్రీశైలం ప్రాంతంలో నల్లమల టైగర్ సఫారి చేయగలిగితే పర్యాటక రంగానికి ఊతమొస్తుందని అన్నారు. తిరుపతి మాదిరిగా సున్నిపేటను నివాస ప్రాంతంగా మార్చి వసతులు కల్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటే పరిశ్రమలు, పర్యాటక రంగం, ఆధ్యాత్నిక కేంద్రాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో తప్పులు పోస్టింగులు పెట్టే ఏ పార్టీ లో ఉన్నవారినైనా ఊరుకోబోమని హెచ్చరించారు. చివరికి వైసీపీలో ఉన్న ఆడబిడ్డలు, తల్లులపై కూడా పెట్టే పోస్టింగులపై సహించబోమని అన్నారు. పోలీసు అధికారులు లాలుచి పడి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అదే వారికి చివరిరోజు అవుతుందని హెచ్చరించారు.