అమరావతి : దుర్గామల్లికార్జున స్వామి కొలువుదీరిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై (Indrakiladri) భవానీ విరమణ దీక్షలు (Bhavani Diksha ) శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. దేవస్థానం అర్చకులు హోమగుండం వెలిగించి దీక్ష విరమణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఈనెల 25 వరకు దీక్ష విరమణ కార్యక్రమాలుంటాయని ఆలయ అధికారులు వివరించారు. భవానీ భక్తుల సౌకర్యం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక యాప్ను (Special Aap) అందుబాటులోకి తీసుకొచ్చారు. భవానీ భక్తుల దీక్షల విరమణ సందర్భంగా ఈనెల 25 వరకు అన్ని ఆర్జిత సేవలు, టికెట్ల దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.
5 రోజుల పాటు మండల, అర్థమండల దీక్షలు ధరించిన ఆరు లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చివరి రెండురోజుల్లో రోజుకు లక్ష నుంచి రెండు లక్షల మంది వరకూ భవానీలు వస్తారని భావిస్తున్నారు.
భక్తులకు అమ్మవారి ప్రసాదం విక్రయించేందుకు 14 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి దిగువున 11, కొండపైన ఒకటి, రైల్వేస్టేషన్, బస్స్టేషన్లో ఒక్కొక్కటిగా ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 20 లక్షల లడ్డూ ప్రసాదం తయారు చేశారు. భవానీ భక్తులు కృష్ణా జల్లు స్నానాలు చేసేందుకు సీతమ్మ వారి పాదాల వద్ద 500, పున్నమి ఘాట్ వద్ద 200, భవానీ ఘాట్ వద్ద 100 షవర్లను ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద సుమారు 4వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.