అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంపై బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. క్యాసినో నిర్వహించిన మంత్రిపై చర్యలు తీసుకునే దమ్ము లేని ప్రభుత్వం.. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నదని ఆరోపించారు.
బీజేపీ నేతలు సంక్రాంతి ముగింపు సంబరాలకు వెళ్తుంటే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని జీవీఎల్ ప్రశ్నించారు. పోలీసులు నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ అరెస్ట్లు చేశారన్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి అనేక స్టేషన్లను తిప్పారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. అలజడులు సృష్టిస్తున్న వారిని ఏం చేయలేని ప్రభుత్వం, తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు.
బీజేపీ నేతలను గుడివాడకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారో ప్రభుత్వం చెప్పాలని జీవీఎల్ నరసింహారావు నిలదీశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలకు ముగ్గుల పోటీలు పెట్టడం రాదని, మూడు ముక్కలాట మాత్రం వచ్చని జీవీఎల్ ఎద్దేవా చేశారు.