చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాదం అందర్నీ కలిచివేసింది. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా సూచించారు. బాధితులు కోలుకునేంత వరకూ, వారి ఆరోగ్యం మెరుగుపడేం వరకూ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని సీఎం జగన్ వైద్యులను కోరారు.
బాధితులను పరామర్శించిన ఏపీ మంత్రి రామచంద్రారెడ్డి
భాకరా పేట బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారికి తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారందరికీ మెరుగైన వైద్యం అందించాలని, ఎక్కడా వెనకాడవద్దని రామచంద్రా రెడ్డి వైద్యులను ఆదేశించారు.
మెరుగైన వైద్యం అందించాలి : చంద్రబాబు
భాకరా పేట బస్సు ప్రమాదంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెళ్లింట్లో ఇలా ప్రమాదం జరగడం విచాకరమని అన్నారు.
ఎంతో బాధించింది : పవన్ కల్యాణ్
భాకరా పేట బస్సు ప్రమాదం తనను ఎంతో బాధించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తన మనస్సును ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగిన చాలా సేపటి వరకూ ఎవరూ స్పందించకపోవడం ఎంతో బాధాకరమన్నారు. బస్సు అత్యధిక స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారని, బస్సులకు వెంటనే స్పీడ్ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.