CBN | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించిందన్న ఆయన.. ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరించే లక్ష్యంతో 100 రోజుల ప్రణాళికతో అన్ని శాఖల్లో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించామని గుర్తుచేసుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కింమన్నారు. ప్రజల సహకారం, తమకు ఉన్న అనుభవంతో నిలదొక్కున్నామన్నారు. 120కిపైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమంగా నిలిచామన్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించామని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేలాది అమరుల త్యాగాల ద్వారా వచ్చిన స్వాతంత్ర్యం ఈ రోజు వేడుకగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే, వేడుకలు జరుపుకుని ఆనందించడం సరిపోదని, ప్రతీ ఒక్కరూ దేశంపై తమ బాధ్యతను గుర్తుచేసుకోవాల్సిన రోజన్నారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని పిలుపునిచాచరు. దేశం పట్ల ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. ఆ బాధ్యతే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందన్నారు. జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర్య యోధులను సైతం పవన్ స్మరించుకున్నారు.