CM Chandrababu | అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు. తనకు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని శంకరయ్య డిమాండ్ చేశారు. సీఐ శంకరయ్య సమక్షంలోనే నిందితులు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని గతంలో చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారంటూ ఈనెల 18న సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసులు పంపారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసుల్లో సీఐ శంకరయ్య పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
2019 మార్చిలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శంకరయ్య పులివెందుల సీఐగా విధ్యులు నిర్వర్తిస్తున్నారు. అయితే శంకరయ్య సమంక్షలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. ఇక విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 2019లోనే శంకరయ్యను నాటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఇదిలా ఉండగా.. వివేకా హత్యపై కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని శంకరయ్య పేర్కొన్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టంకు పంపించొద్దని, మృతదేహంపై గాయాలు ఉన్నాయని ఎవరికీ చెప్పొద్దని తనను భయపెట్టారని శంకరయ్య సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా తనకు వేరే పనులు ఉన్నాయంటూ శంకరయ్య దాటవేస్తూ వచ్చారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే అంటే 2021 అక్టోబర్ 6న శంకరయ్యపై ఉన్న సస్పెన్షన్‌ను నాటి వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది.
నిందితులు ప్రభావితం చేయడం వల్లే శంకరయ్య మాట మార్చారని సీబీఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా శంకరయ్య ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శంకరయ్య ప్రస్తుతం కర్నూల్ రేంజ్లో వీఆర్‌లో ఉన్నారు.