హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ.. సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంపై ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అప్పట్లో చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగివచ్చాడని తెలిపారు. దీంతో బాలకృష్ణ స్పందిస్తూ ఆగ్రహంతో మాట్లాడారు. ‘కామినేని శ్రీనివాస్ చెప్పినట్టు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు జగన్ దిగి వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ. ఆయనంత పెద్ద గట్టిగా చెప్తే.. ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టరును కలవడన్నడట’ అంటూ బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడారు.
అలాగే కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసిన లిస్టులో 9వ పేరుగా తన పేరును ముద్రించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవడాడు ఇలా రాసింది’ అని ఆరోజే తాను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను నిలదీసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు నన్ను కలిశారు. సినిమా టికెట్ల ధరల పెంపు గురించి మాట్లాడితే బాగుంటుందని నిర్మాతలు కోరారు. కొంత మందితో అప్పటి జగన్‌ను కలిశాం. నేను చొరవ చూపడంతో నాటి ప్రభుత్వం టికెట్ల ధర పెంపునకు సమ్మతించింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు టికెట్ల ధరలు పెరిగాయి. ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా పరస్పర గౌరవంతో ఇచ్చిపుచ్చుకునే విధానంలో మాట్లాడుతా’ అని చిరంజీవి తెలిపారు.