అమరావతి : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu)పై మరోసారి విరుచుకు పడ్డారు. రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని ఎక్స్ వేదిక ద్వారా ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి మొత్తం 8 ప్రశ్నలు సంధించారు.
ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల (MBBS Seats) కోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనమని నిలదీశారు.
నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు. వైసీపీ హయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించామని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది ?. 2023-24 సంవత్సరాల్లో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం శోచనీయమని అన్నారు. ఇకనైనా కళ్లుతెరచి, వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవడంతోపాటు, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.