అమరావతి : ఏపీలో అన్యాయమైన పాలనను ప్రజలు భరిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి( YS Jagan Mohan Reddy ) అన్నారు. త్వరలోనే చంద్రబాబు ( Chandra babu ) దుర్మార్గమైన పాలనకు ముగింపు పడుతుందని జోస్యం చెప్పారు. గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో రంపచోడవరం ( Rampachodavaram ) నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రెండేళ్ల కూటమి పాలనలో అన్ని విధ్వంసమే కొనసాగుతుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. చీకటి కొంతకాలమే ఉంటుంది. వెలుగు రాక తప్పదని వెల్లడించారు. మరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
ప్రజల తరుఫున పార్టీ నాయకులు అండగా నిలబడాలని సూచించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగిస్తున్న ప్రభుత్వంపై పార్టీ పోరాడుతుందని వివరించారు. వైసీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నేటి కూటమి పాలనలో జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఇచ్చిన హామీలలో 99శాతం అమలు చేసిన ఘనతను సొంతం చేసుకుందని పేర్కొన్నారు.