అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పన్నుల పేరిట ప్రజలను దోచుకోవడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) పాలసీగా పెట్టుకున్నారని ఆయన జగన్ కాదు.. జలగ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) విమర్శించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ రా కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అబద్దాల్లో జగన్ పీహెచ్డీ చేశారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలకు రూ.10 ఇచ్చి రూ. 100 దోచుకోవడమే జగన్ పాలసీ అని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయ వ్యాపారని, మద్యం(Liquar) పై వచ్చిన డబ్బును లెక్క పెట్టుకోవడమే జగన్ పని అని విమర్శించారు. ఇలాంటి జలగ మనకు అవసరం లేదని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో లేని లేని పన్నులు వైసీపీ పాలన ఎందుకొచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ పాలనలో పన్నుల వాత లేదు. అప్పుల మోత లేదని పేర్కొన్నారు. ఆర్టీసీ ఛార్జీలను, నిత్యావసర ధరలు పెంచి పేదవాడి బతుకు చితికిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని వెల్లడించారు. ‘ మద్యపాన నిషేధమని చెప్పి జగన్ మాట తప్పారు. మాట తప్పిన వ్యక్తికి ఓటు అడిగే హక్కులేద’ ని తెలిపారు.