అమరావతి : సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu) హస్తం ఉందని వైసీపీ నాయకురాలు, మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి(Lakshmi Parvati) ఆరోపించారు. ఈనెల 4న రాత్రి పుష్ప-2 (Puspa-2) సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, హీరోయిన్ రష్మిక వచ్చారు.
ఈ సందర్భంగా సినిమాను చూడటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకుల మధ్య జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు థియేటర్ యజమానితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు కావడంతో శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.
ఈ విషయంపై లక్ష్మీపార్వతి స్పందించారు. చంద్రబాబు నాయుడు పుష్కరాలకు, కందుకూరుకు వెళ్లినపుడు తొక్కిసలాటలో ఎంతో మంది చనిపోయారని గుర్తు చేశారు. ఈ లెక్కన చంద్రబాబు నాయుడును పోలీసులు ఎన్ని సార్లు అరెస్ట్ చేయాలని అన్నారు. చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.