అమరావతి : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని టీడీపీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరావు (Vadde Shobhanadriswarao) ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు (Visaka Steel) కర్మాగారానికి బ్లాస్ట్ ఫర్నేస్ మూడపడడం సిగ్గుచేటని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోలేకపోతే చంద్రబాబు (Chandra Babu) ను ప్రజలు క్షమించరని అన్నారు.
స్టీల్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా ఆంధ్రకు చెందిన శ్రీనివాస వర్మ ఉన్నప్పటికీ బ్లాస్ట్ ఫర్నేస్ (Blast Furnace) మూతపడడం దారుణమన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతున్నా కూటమి నేతలు స్పందించంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశమని గుర్తు చేశారు. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
స్టీల్ మినిష్టర్ కుమారస్వామి వైజాగ్ వచ్చి వెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. కర్నాటకలో మూతబడిన హెచ్ఎంటీ వాచ్ కంపెనీని తెరిపించుకున్నాడని, తెలుగు ప్రజలు చేసుకున్న పాపమేమిటో మోదీని టీడీపీ నేతలు నిలదీయాలని సూచించారు. కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్నాయుడు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ గురించి శ్రద్ధ వహించాలని సూచించారు.