విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో చికిత్స పొందుతున్న టీడీపీ ఏపీ కార్యదర్శి చెన్నుపాటి గాంధీని చంద్రబాబు పరామర్శించారు. గాంధీపై దాడికి పాల్పడిన దోషులు ఎవర్నీ వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ రాక్షస పాలనలో గాంధీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీల ఆగడాలకు అంతులేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.
మా నాయకుడిపై జరిగిన దాడిని భావోద్వేగంతో జరిగిందని పోలీసులు చెప్పడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. గాంధీపై దాడికి పాల్పడిన వారికి అండగా ఉండటమే పోలీసుల బాధ్యతా అని ప్రశ్నించారు. బాధితుడిపైనే కేసులు పెట్టడం ఈ రాష్ట్రం పోలీసులకే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిరికిపందల దాడులకు తామేమీ భయపడమని, తమపై దాడులు చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనలో దోషులకు శిక్ష పడే వరకు న్యాయపరంగా పోరాడతామని తేల్చిచెప్పారు. గతంలో టీడీపీ నేత పట్టాభిపై కూడా దాడి చేశారని, ఆ రోజున పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వైసీపీ అరాచకాలపై ప్రజల్లో చైతన్యం ప్రారంభమైందని.. ప్రతిఘటించి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని తెలిపారు.
విజయవాడ 9వ డివిజన్లో చెన్నుపాటి గాంధీపై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గాంధీపై దాడి సమయంలో వైసీపీ నేతలను స్థానికులు అడ్డుకోవడంతో వదిలేసి పారిపోయారని, ఇనుపచువ్వతో దాడి చేయడంతో కన్నుపై గాయమైందని టీడీపీ నేతలు చెప్తున్నారు.