Pawan Kalyan | పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా బలమని కొనియాడారు. నాయకుడి అనుభవం ఉపయోగించుకోకపోతే తప్పుచేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. అందుకే కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం నిర్వహించిన ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దెబ్బలు తట్టుకుని నిలబడ్డామని అందుకే ఇప్పుడు పనులు చేయగలుగుతున్నామని చెప్పారు.
గత పాలనతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో గ్రామసభలు కూడా పెట్టలేదని.. నిర్ణయాలు ఎలా తీసుకున్నారో తెలియదని అన్నారు. గత పాలనలో డబ్బులు ఎలా ఖర్చయ్యాయో ఎవరికీ తెలియదని విమర్శించారు. అభివృద్ధి జరగలేదు కానీ నిధులు మాయమయ్యాయని ఆరోపించారు. ఆగస్టు 23న రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లెల్లో పనులు మొదలుపెట్టామని పేర్కొన్నారు. ప్రతి పనికి డిస్ప్లే బోర్డు ఉంటుందని అన్నారు.
గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం అంత ఈజీ కాదని పవన్ కల్యాణ్ అన్నారు. పారదర్శకతతో తాము పాలిస్తున్నామని తెలిపారు. తాము పారదర్శకంగా ఉన్నా అధికారుల తీరు మారడం లేదని మండిపడ్డారు. మా పేరుతో ఓ అధికారి కాకినాడలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఏ అధికారి అయిన తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమలాగే అధికారులు కూడా పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇది లంచాల ప్రభుత్వం కాదు.. మంచి ప్రభుత్వమని స్పష్టం చేశారు.