అమరావతి : ఏపీలో ఏడు నెలల చంద్రబాబు (Chandra Babu) పాలన ప్రజలను ఏడిపించే పాలనగా కొనసాగిందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ( MLC Varudu Kalyani ) ఆరోపించారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగులుపోతుందని పేర్కొన్నారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. 50 శాతానికి పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారని అన్నారు. దేశంలోనే ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడి జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న చంద్రబాబు పాలనలో మాత్రం వెనుకంజలో ఉన్నారని విమర్శించారు. కూటమి నాయకుల మోసాలకు రాష్ట్ర ప్రజలు బలయ్యారని వెల్లడించారు. ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు.
సూపర్ సిక్స్ హామీలు రాష్ట్రంలో ఏ మేరకు అమలవుతున్నాయో చర్చకు తాను సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గజని పాలన కొనసాగుతుందని, నారావారి నరక పాలన చూస్తున్నారని ఆరోపించారు. తల్లికి వందనం, అమ్మ ఒడి, ఫ్రీ బస్సు, ఫీజు రియింబర్స్మెంట్ ఇచ్చారా అని ప్రశ్నించారు.