అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తూ వైసీపీ (YCP Buildings) కార్యాలయాలను విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. గురువారం ఆయన వైసీపీ నాయకులు కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజావేదికను జగన్ కూల్చారనే కక్షతో వైసీపీ కార్యాలయాలను కూలుస్తున్నారని మండిపడ్డారు.
వాస్తవానికి చంద్రబాబు (Chandra Babu) తీసుకొచ్చిన జీవోలతోనే వైసీపీ పార్టీ ఆఫీసుల నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. నిర్మాణాలు అక్రమమైతే నోటీసులు ఇవ్వాలని , అలా కాకుండా నేరుగా విధ్వంసాలకు పాల్పడడం అరాచకానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం చేతిలో ఉందని అరాచకాలు చేస్తే ప్రజలు సహించరని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి ఈవీఎంను పగులకొట్టినట్లుగా ఉన్న వీడియోను నారా లోకేష్ సృష్టించి ట్విట్టర్లో పెట్టారని విమర్శించారు. వైసీపీ నేతలపై ఇంకా ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని అన్నారు. పిన్నెల్లి అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వెల్లడించారు.