అమరావతి : ఏపీలో స్కిల్ డెవలప్మెంట్(Skill Development) కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu) సుప్రీంకోర్టులో (Supreme Court ) ఊరట లభించింది. ఈ కేసులో 2023లో ఏపీ హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను రద్దు చేయాలని నాటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ రాగా జస్టిస్ బేలా త్రివేది (Justice Bela Trivedi) ధర్మాసనం విచారించి కేసును కొట్టివేసింది. ఇప్పటికే ఈ కేసులో ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వివరించగా ఛార్జిషీట్ దాఖలైనందున జోక్యం అవసరంలేదని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయ పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఓ పాత్రికేయుడు ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసుతో మీకేం సంబంధం? మీరెవరు? పిల్ దాఖలుకు అర్హత ఏందని ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ప్రశ్నించింది. సంబంధం లేని అంశంలో పిటిషన్ ఎలా వేస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరిస్తూ ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను డిస్మిస్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు.