అమరావతి : విజయవాడ ముంపునకు కారణమైన బుడమేరు వాగుపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandra Babu) తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. విజయవాడలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు (Floods) సంభవించాయని దుయ్యబట్టారు. వర్షాలు, వరదలపై ముందస్తు సమాచారం ఉన్నాగాని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల విపత్తు ఎదురైందని అన్నారు. వైఎస్ జగన్ వల్లే వరదలు వచ్చినట్లు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
వైసీపీ అధికారం వచ్చిన తరువాత బుడమేరు బఫర్‌జోన్‌లో ఉన్న కట్టడాలను తొలగించామని వెల్లడించారు. ఈ విషయంలో టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2005లో బుడమేరకు వరద రాగా అప్పటి ప్రభుత్వం వాటర్ డైవర్షన్ కోసం రూ. 241 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. బఫర్‌జోన్‌లో నివాసముంటున్న చంద్రబాబు ఇంటిని కూల్చివేసి శభాష్ అనిపించుకోవాలని పవన్‌కల్యాణ్‌కు సూచించారు.