తిరుమల : తిరుమలలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో నిర్వహించే చక్రతీర్థ ముక్కోటిని బుధవారం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, హారతి చేపట్టారు.
వరాహ పురాణం నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో చక్ర తీర్థం అత్యంత ముఖ్యమైనదని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్ బాబు, ఎవిఎస్వో సురేందర్,భక్తులు పాల్గొన్నారు.