తిరుమల : వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో (Tirumala) ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పదిరోజుల పాటు నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శనివారం పుష్కరిణి ( Pushkarini ) తీర్థ ముక్కోటిలో చక్రస్నానం నిర్వహించారు. అనేక వేల తీర్థాలలో, స్వామి పుష్కరిణి అత్యంత పవిత్రమైనదని అర్చకులు తెలిపారు.
శనివారం వేకువజామున సుదర్శన చక్రత్తాళ్వార్‌ను పవిత్ర పుష్కరిణి వద్దకు చిన జీయర్ స్వామి సన్నిధిలో వేద మంత్రాలతో తీసుకువచ్చి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్వార్ తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో (TTD EO) శ్యామలరావు, బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, డీఈవో లోకనాథం, పేష్కార్ శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నిన్న స్వామివారిని 60,094 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 14,906 మంది తలనీలాలు సమర్పించుకున్నారని ఆలయ అధికారులు వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 2.45 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు విరాళం
హైదరాబాద్‌లోని సాయి రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ చీఫ్ ఎం జనార్దన్ అనే భక్తుడు
శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ. 10 లక్షలను విరాళంగా అందించారు. శనివారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.