హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద (former minister) హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(cbi) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో నిజనిజాలే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదురొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపిన సీబీఐ తాజాగా మరోసారి విచారణ చేపట్టనుంది. మార్చి 6న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఈ సందర్భంగా సీబీఐ(cbi) అధికారులు వైఎస్సార్ పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసు(notice)లు ఇచ్చారు. సోమవారం విచారణకు రాలేనని అవినాశ్ చెప్పగా ఖచ్చితంగా విచారణకు రావాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసింది. మరోవైపు అవినాశ్ తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల కిందట ఈ నెల 12న విచారణకు రావాలని తెలిపిన సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చి ఈ నెల 6వ తేదీనే రావాలన్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు రావాలని ఆయనకు జారీచేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. తండ్రి, కుమారులు ఇద్దరిని ఆరవ తేదీన సీబీఐ విచారించనుంది.
జనవరి 28న మొదటిసారి, ఫిబ్రవరి 24న రెండోసారి విచారించి సీబీఐ పలు కీలక అంశాలను సేకరించినట్లు సమాచారం. కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బృందం అవినాశ్‌రెడ్డిని ప్రశ్నించింది. ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు, ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై దాఖలు చేసిన కౌంటర్లో అనేక సంచలన విషయాలు పేరొన్న సీబీఐ , అందులో అవినాశ్‌రెడ్డి గురించి చాలా సార్లు ప్రస్తావించింది. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి పాత్రను మొదటి నుంచి అనుమానిస్తున్న సీబీఐ గత నెల 28న మొదటిసారి విచారించింది.