అమరావతి : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. ఈనెల 11 నుంచి 30వ తేదీ వరకు జగన్ యూకేలో (UK) పర్యటించనున్నారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ విదేశాలకు వెళ్లడానికి సీబీఐ కోర్టు (CBI Court) అనుమతి తీసుకోవాలని గతంలో నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఏడాది మే 16వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ మధ్యలో లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఆయన పర్యటించి వచ్చారు. అనంతరం తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 3 నుంచి 25వ తేదీ వరకు యూకే వెళ్లేందుకు సీబీఐ అనుమతి కోరగా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. తాజాగా మూడోసారి సీబీఐకి అనుమతిని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కుటుంబసమేతంగా విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అంగీకారం వ్యక్తం చేసింది.